Sunday, May 8, 2011

ఎప్పటికీ అమ్మ అమ్మే!


నిజమే! కాలం మారింది. సమాజం మారింది.కానీ కాలమేదైనా, మతమేదైనా, మాతృత్వాన్ని ఆరాధించింది. ఆరాధిస్తోంది. కేవలం తల్లి కావడంవల్లనే ఆమెకు దైవత్వాన్నిచ్చి పూజించింది. తల్లితండ్రులూ, అమ్మానాన్నా అంటూ - అమ్మయే ప్రధమగణ్యం! క్రిస్టియన్లు, జ్యూస్, ముస్లిం మతాల్లో కూడా 'తల్లి'స్థానం గణనీయం. కేథలిక్స్ 'మేరీమాత'నే ఆరాధిస్తారు. హిందూమతంలో- జగజ్జననిగా పార్వతిని తొలుత సంభావించడం వుంది. ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మగా జగజ్జనని ఆరాధింపబడుతోంది. గ్రీకుల 'డిమేటర్' స్థానమూ అలాంటిదే!
అమ్మ వాస్తవం, తండ్రి విశ్వాసం.
అమ్మను మోసంచేసే నాన్నలూ, అమ్మను హింసించే కొడుకులూ, 'కలుగనేటికి తల్లుల కడుపుచేటు'గా వర్తించే సంతానం, సమాజంలో కానవస్తున్న కాలంలో- 'మదర్స్‌డే' అంటూ తల్లికోసం ఒకరోజును అంతర్జాతీయంగా గుర్తించడంలో, మాతృమూర్తులైన స్ర్తిల ఔన్నత్యాన్నీ, వారి గౌరవాదరాలనూ విధిగా సమాదరించే సంస్కారాన్ని మేల్కొల్పడం కూడా, ఓ హేతువై వుండడంలో తప్పేంలేదు! అది నేటి అగత్యం కూడాను.

ఒకప్పుడు 'అమ్మ'అంటే ఇంటి పట్టునే వుండి, నాన్న సంపాదించి సంసార భారాన్ని వహిస్తూంటే- అమ్మ ఇంటి పనీ, వంట పనీ చేస్తూ, పిల్లలను సంరక్షించుకుంటూ, ఇంటికి వచ్చిన అతిథులకు వండి వడ్డిస్తూ, తండ్రికి చేదోడు వాదోడుగా ఉండే ఇల్లాలు మాత్రమే. భర్త మాట జవదాటక, అత్తమామలకు అణగిమణగి వుంటూ, పుట్టింటి గౌరవాన్నీ, మెట్టినింటి ప్రతిష్ఠనూ నిలుపుతూ- పిల్లల పెంపకం, వారికి క్రమశిక్షణ గరపడం, విద్యాబుద్ధులు కలిగించడంలో తోడ్పడడం అమ్మ పని.

                                         వీటికి అదనంగా ఇవాళ- 'అమ్మ' ఆఫీసులోనూ పనిచేస్తుంది! నాన్నకన్నా ఎక్కువ సంపాదిస్తున్న అమ్మలూ వున్నారు. హోదాల్లో, అధికారంలో, మేథస్సులో, కార్యనిర్వహణలో, 'అమ్మలై'కూడా స్ర్తిలు అధిగమిస్తున్న వారున్నారు. అలాగని ఆమె గృహ బాధ్యతల్లో మార్పేమీలేదు.పిల్లల సంరక్షణలో అమ్మదే ప్రధాన బాధ్యతగా వుండడంవల్లనే- ఆరవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వంలోని తల్లులైన మహిళా ఉద్యోగినులకు 2008 సెప్టెంబర్ 1నుండి అమలులోకి వచ్చే విధంగా '్ఛల్డ్ కేర్ లీవ్' అనేది ప్రత్యేకంగా కల్పించింది. ఇది ప్రసూతి సెలవులకూ, వారికి వుండే ఆర్జిత సెలవులకూ, మిగతా సెలవులకూ- 'అదనంగా' కల్పించబడిన సౌకర్యం! అంతకుముందు వున్న ప్రసూతి సెలవు దినాలను కూడా 180 రోజులకు పెంచడమేకాక, ఈ '్ఛల్డ్ కేర్ లీవ్' క్రింద ఇద్దరు పిల్లలవరకూ, వారికి 18 సంవత్సరాలు నిండేలోగా, ఉద్యోగిని అయిన ఆ తల్లి, సంవత్సరానికి మూడు విడతలుగా, విడతకు పదిహేను రోజులు తక్కువ కాకుండా, మొత్తం 730 రోజులు, అంటే రెండు సంవత్సరాలు- పూర్తి జీతం పొందుతూ, సెలవులో వుండే సౌకర్యం అమలవుతోంది! పిల్లలకు జ్వరం వచ్చినా, వారి పరీక్షలకైనా తల్లి సెలవుపెట్టి, వారి పెంపకం బాధ్యతలను నిర్వర్తించడానికి, 'అమ్మ'తనానికి కల్పించిన గౌరవమే ఇది! రెండేళ్ల కాలం ఆర్థిక లోటు కూడా లేకుండా, '్ఛల్డ్ కేర్ లీవ్' అనేది - పిల్లల పట్ల తల్లులకు, వారి బాధ్యతా నిర్వహణకు ఒక వెసులుబాటే ఇది.

                                       కుమార శతకంలో- పంచమాతల గురించి చెప్పబడింది. రాజుగారి భార్య అంటే రాణి, అన్నగారి భార్య. అనగా వదిన, గురువుగారి భార్య అనగా గురుపత్ని, అలాగే భార్య తల్లి అంటే అత్తగారు, తనను కన్నతల్లి అంటే 'అమ్మ'-ఈ అయిదుగురూ అమ్మలే! 'మదర్స్‌డే'ని విస్తృతార్థంలో తీసుకున్నా వీరందరినీ గౌరవించడం, వారి పట్ల గౌరవాదరాలు, శ్రద్ధాసక్తులు కలిగి వుండడం మనిషి కర్తవ్యం!

www.andhrabhoomi.net

No comments:

Post a Comment