Friday, May 13, 2011

55 ranks in Civils for Andhra Pradesh


సివిల్స్‌లో సూపర్!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాల్ని బుధవారం ప్రకటించింది. మొత్తం 920 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఇందులో జనరల్ 428, ఓబీసీ 270, ఎస్సీ 148, ఎస్టీ 74 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన మొత్తం 920 మందిలో ఐఏఎస్‌కు 151 మందిని, ఫారిన్ సర్వీస్‌కు 35, ఐపీఎస్‌కు 150 మందిని తీసుకుంటారు. గ్రూప్-ఎ పోస్టులకు 623 మందిని, గ్రూప్-బి పోస్టులకు 84 మందిని తీసుకుంటారు. ఎంపికైన వారిలో 717 మంది పురుషులు, 203 మంది మహిళలు ఉన్నారు.ఈసారి సివిల్స్ మొదటి రెండు ర్యాంకులూ మహిళలే సాధించటం విశేషం. చెన్నైకి చెందిన ఎస్.దివ్యదర్శిని ఈ ఏడాది ఐఏఎస్ టాపర్‌గా నిలిచారు.టాప్ 25లో అత్యధికంగా 15 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉండగా, ఐదుగురు వైద్య పట్టభద్రులు, మిగిలిన ఐదుగురు సైన్స్, మేనేజ్‌మెంట్, కామర్స్, సోషల్ సెన్సైస్ పట్టభద్రులు ఉన్నారు.

జాతీయ స్థాయిలో మొదటి వంద లోపు ర్యాంకర్లలో మన రాష్ట్రానికి చెందిన వారు 18 మంది ఉన్నారు. 2, 12, 13, 18, 23, 24, 25, 26, 31, 37, 52, 53, 54, 57, 83, 90, 94, 96 తదితర ర్యాంకుల్ని రాష్ట్ర అభ్యర్థులు సొంతం చేసుకున్నారు.


కృషి ఉంటే కలెక్టర్లవుతారు!

జిల్లా పరిషత్ స్కూల్లో చదివినవారు... సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవారు... వ్యవసాయ కుటుంబానికి చెందినవారు... ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకున్నవారు... నేపథ్యం ఏదైనా అవరోధాలను అధిగమిం చారు. దేశంలో అత్యున్నత సర్వీసుగా భావించే సివిల్స్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించి విజేతలుగా నిలిచారు.

బీసీ సంక్షేమ హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేసిన ఒక తల్లి కుమారుడు పి.సునీల్‌కుమార్ 18వ ర్యాంక్ సాధిస్తే.. పంచాయతీ కార్యాలయానికి వాచ్‌మన్‌గా పనిచేసిన పోశయ్య కుమారుడు దొడ్డె ఆంజనేయులు 278వ ర్యాంకు సాధించి.. నిరుపేద విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. అలాగే.. రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల పిల్లలు కూడా సివిల్స్‌లో విజయం సాధించారు.

వారిలో రెండో ర్యాంకర్ శ్వేతా మొహంతి (తండ్రి ఐఏఎస్ పి.కె.మొహంతి ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు), 90వ ర్యాంకర్ డి.కృష్ణభాస్కర్ (తల్లి ఐఏఎస్ లక్ష్మీపార్థసారథి ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శి), 139వ ర్యాంకర్ అభిషేక్ మొహంతి (తండ్రి ఐపీఎస్ ఎ.కె.మొహంతి రిటైర్డ్ డీజీపీ), 496వ ర్యాంకర్ దీవన్‌రెడ్డి (తండ్రి ఐపీఎస్ గోపీనాథ్‌రెడ్డి ప్రస్తుతం జైళ్లశాఖ డీజీ) ఉన్నారు.

సత్తా చాటిన సిటీ


సివిల్స్‌లో సిటీ సత్తా చూపింది. అభ్యర్థులు జాతీయ స్థాయిలో ర్యాంకుల పంట పండించారు. అత్యున్నత భారత సర్వీసుల్లో నగరం విజయబావుటా ఎగురవేసింది. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంతానం తండ్రుల బాటలోనే నడిచి సివిల్స్‌లో విజయకేతనం ఎగురవేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి పి.కె.మొహంతి కుమార్తె శ్వేతామొహంతి అఖిల భారతస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. ఆమె హైదరాబాద్ జేఎన్‌టీయూలో కంప్యూటర్ సైన్స్ చదివారు. తండ్రి మొహంతి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. శ్వేత ఇప్పటికే మొదటి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపికై.. ప్రస్తుతం సిలిగురిలో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. తండ్రి ప్రస్తుతం జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్‌లో డెరైక్టర్‌గా పని చేస్తున్నారు. శ్వేత ఐఏఎస్ వెస్ట్‌బెంగాల్ కేడర్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఇపుడే పయనం మొదలైంది: శ్రవణ్
అఖిల భారత సర్వీసుల్లో 13వ ర్యాంకు సాధించిన పులిపాక అనిరుధ్ శ్రవణ్.. ప్రస్తుతం అస్సామ్‌లో నాబార్డ్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయనబిట్స్‌పిలానీలో బీటెక్ ఆనర్స్ సివిల్ ఇంజనీర్ (2003-2007) పూర్తి చేశారు. ఆపై ఏడాది పాటు హైదరాబాద్‌లోని ఐబీఎంలో పని చేశారు. 2008లో ఐఏఎస్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు. తొలి యత్నంలో ప్రిలిమ్స్ వద్దే ఆగిపోయారు. 2009లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. చివరికి సివిల్స్- 2010లో విజయం సాధించారు. జాగ్రఫీ, పబ్లిక్‌అడ్మినిస్ట్రేషన్‌ను ఆప్షనల్స్‌గా ఎంచుకుని ర్యాంకు సాధించినట్టు శ్రవణ్ చెప్పారు. ఆయన తండ్రి పులిపాక సత్యనారాయణ ఆంధ్రాబ్యాంకులో మేనేజర్. వీరు ఈసీఐఎల్‌లో ఉంటున్నారు.

రైతు కుటుంబంలో పుట్టి..
సివిల్స్‌లో 53వ ర్యాంకు సాధించిన పి.శివశంకర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌టాక్స్‌గా పనిచేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10లోని ఐటీ ఆఫీసర్స్ కాలనీలో ఉంటున్నారు. స్వస్థలం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం జనార్ధన్‌పల్లి గ్రామం. తండ్రి సుబ్బరాయుడు, తల్లి శారద రైతులు.

తొలి యత్నంలోనే...
హిమాయత్‌నగర్‌కు చెందిన కృష్ణ భాస్కర్ సివిల్స్‌లో అద్భుత 90వ ర్యాంక్ సాధించారు. ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారులు లక్ష్మీపార్థసారథి, భాస్కర్‌ల కుమారుడు. హిమాయత్‌నగర్‌లోని తిరుమల అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఐసీఎస్‌ఈ, ఐఐటీ, ఐఎస్‌బీ విద్యార్హత ఉన్న ఆయన తొలి ప్రయత్నంలోనే ఈ ఫలితం సాధించారు.

ప్రజలకు ఉత్తమ సేవలందిస్తా
సివిల్స్‌లో 177 ర్యాంకు సాధించిన నా స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం తుంగతంపరం.తండ్రి సికింద్రాబాద్ ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్. తల్లి విజయలక్ష్మి గృహిణి. 2005 నుంచి కోచింగ్ తీసుకుంటున్న నేను నాల్గవయత్నంలో ఈ ర్యాంకు సాధించాను. ప్రజలకు ఉత్తమ సేవలందించేదుకు కృషిచేస్తా..
- వెంకట అప్పలనాయుడు. 177 ర్యాంకు, ఐపీఎస్

ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతా
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం రుక్మిణి గ్రామాణికి చెందిన నాకు రెండోయత్నంలో ఈ ర్యాంకు వచ్చింది. ఎంఎస్సీ మ్యాథ్స్, బీఈడీ చేశాను. 2008లో గ్రూప్-2 రాసి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నాను. తండ్రి రాఘవేంద్రమూర్తి ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఉపకార్యదర్శి. తల్లి వరలక్ష్మి గృహిణి. కష్టపడి చదివి ఐఆర్‌ఎస్ సాధించాను. ఐఏఎస్‌కు వెళ్లి ప్రజలకు సేవ చేస్తా.
- గురుకుమార్ శర్మ, 365 ర్యాంకు, ఐఆర్‌ఎస్

ప్రణాళికాబద్ధ కృషితోనే...
కష్టపడి ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తే సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించవచ్చు. నా స్వగ్రామం నిజామబాద్ జిల్లా బీంగల్. తండ్రి వ్యవసాయదారుడు. బీ.టెక్ పూర్తిచేశాను.2007 నుంచి సివిల్స్ కోసం చదువుతున్నా. 2009లో తొలియత్నంలోనే ఐఆర్‌టీఎస్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రజలకు మంచి సర్వీస్ అందిస్తా.
- బండి గంగాధర్ , 286 ర్యాంకు, ఐపీఎస్

ప్రజలకు సేవలందిస్తా
నా స్వగ్రామం నల్గొండ జిల్లా మునగాల మండలం విజయరాఘవపురం. తండ్రి బీబీనగర్‌లో పోలీసుకానిస్టేబుల్. తల్లి కళావతి గృహిణి.ప్రజలకు విస్తృత సేవలందిస్తా.
- వేణుధర్ గోదేషి, 458 ర్యాంకు, ఐఆర్‌ఎస్

రోజూ 12గంటలు చదివా
నా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కొమ్మరగిరి పట్నం. ఐదవయత్నంలో ఈ ర్యాంకు సాధించాను. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి విజయలక్ష్మి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. రోజుకు 12 గంటలు కష్టపడితే మంచి ర్యాంకు సాధించవచ్చు. ప్రజలకు ఐఆర్‌ఎస్ ద్వారా మెరుగైన సేవలందిస్తాను.
- ఎం. గంగాధర్ , 818 ర్యాంకు, ఐఆర్‌ఎస్

పోలీసు సేవలను మరింత మెరుగుపరుస్తా
ప్రస్తుతం నల్గొండ జిల్లాలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నా. ఎంబిబిఎస్ చేసి మూడేళ్ళుగా ప్రభుత్వ వైద్యుడిగా కొనసాగుతున్నా. తండ్రి మల్లికార్జునరావు కెమిస్ట్రీ రిటైర్డ్ లెక్చరర్. మూడవయత్నంలో ఈ ర్యాంకు సాధించాను. రోజుకు 8 నుంచి 10 గంటలు చదివాను. పోలీసు సేవలను మరింత మెరుగుపరుస్తా.
-డాక్టర్ ఎల్.రాజేంద్రకుమార్, 502 ర్యాంకు, ఐపీఎస్

శాంతిభద్రతలను పరిరక్షిస్తా
సివిల్స్‌లో ఐపీఎస్‌లో ర్యాంకు రావడం ఎంతో సంతోషం కలిగింది. మూడవయత్నంలో ఈ ర్యాంకు సాధించాను. తండ్రి చందా రిటైర్డ్ స్కూల్ టీచర్ కాగా, తల్లి కమల గృహిణి. ఐపీఎస్‌గా శాంతిభద్రతల పరిరక్షణకు నావంతు కృషి చేస్తా.
ధారావత్ ప్రదీప్ కుమార్, 677 ర్యాంక్, ఐపీఎస్

రెండవ ప్రయత్నంలోనే..
నా స్వగ్రామం నెల్లూరు జిల్లా గూడూరు. 2008 వరకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేశాను. రెండవ ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యాను. ప్రజలకు సేవలందిస్తాను.
-సాయికృష్ణ, 277వ ర్యాంకర్

ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తా
నా స్వగ్రామం కరీంనగర్ జిల్లా ఆజాద్ జమ్మికుంట. మూడవయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యాను. తండ్రి పోచయ్య గ్రామ పంచాయతీ వాచ్‌మెన్ కాగా తల్లి మణెమ్మ గృహిణి. రెండున్నరేళ్ళపాటు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను.
-ఆంజనేయులు దొడ్డె, 278వ ర్యాంకర్

సివిల్స్ ధ్యేయంగా చదివా
2006లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక సివిల్స్ లక్ష్యంగా కష్టపడి చదివాను. ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. నాన్న కెరీర్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ కావడం వల్ల కూడా నా ప్రిపరేషన్‌కు మార్గదర్శిగా నిలిచారు.
-దీప్తిరెడ్డి, 394వ ర్యాంకు, తిరుమలనగర్



No comments:

Post a Comment