Tuesday, August 27, 2013

తెలుగు దేలయన్న దేశంబు తెలుగు... దేశ భాషలందు తెలుగు లెస్స


గ్రాంధిక భాషావాదుల పిడికిళ్లనుండి తెలుగుని విముక్తం చెయ్యడమే వ్యావహారిక భాషోద్యమం. గిడుగు రామమూర్తిగారు పుట్టిన  రోజును తెలుగు భాషా దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవడం గర్వించతగ్గ విషయం. నాటి వ్యావహారిక భాషోద్యమానికి గిడుగు చేసిన సేవలు స్మరించుకోవడం తెలుగువారిగా మనందరి కర్తవ్యం. ఎందుకంటే తెలుగు మాట్లాడటం మన అందరి జన్మహక్కు. కులాలు మార్చుకోవచ్చు, మతాలు మార్చుకోవచ్చు, ప్రాంతాలు మార్చుకోవచ్చు, పార్టీలు రాజకీయంగా మార్చుకోవచ్చు, గోడమీద, రోడ్లమీద బొమ్మలు మార్చుకోవచ్చు - కానీ మాతృభాషను ఎవరూ మార్చుకోలేరు. కాకపోతే ఒక్కొక్క మండలంలో ఒక ప్రత్యేక మాండలిక పదాలు ఉంటాయి. అవి ప్రామాణికాలు కూడా అవుతాయి. వాటికో అందం ఉంటుంది. ఆ నేలలో పుట్టి పెరిగిన వారికి అది అనుభూతమవుతుంది. ఏమయినా తెలుగువారందరి భౌగోళిక ఆత్మ 'తెలుగు ఆత్మ'.
సామాజిక బంధనాలనుండి ప్రజల భాషను ఉద్ధరించడానికి గిడుగు ఎంతో పోరాటం చేశారు. తెలుగు నుడినీ, నానుడినీ పట్టుకుని ప్రజల భాషగా సమకూర్చడానికి గిడుగు, కందుకూరి, గురజాడ, శ్రీపాద, కాళోజీ, పఠాభి, తాపీ, శ్రీశ్రీ లాంటివారు చేసిన కృషి చిరస్మరణీయం. సినారె, రావూరిల కృషి కూడా భాషకు వైభవం అద్దింది.
తెలుగు భాష గొప్పనీ, తెలుగు ప్రజల సాహిత్య, సాంస్కృతిక సంపన్నతల గురించి పదేపదే చాటింపు వెయ్యనక్కర్లేదు. 500 ఏళ్లకు పూర్వమే శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు దేలయన్న దేశంబు తెలుగు... దేశ భాషలందు తెలుగు లెస్స' అని చాటి, చాటించాడు బహిరంగంగా! భాషలొక పది తెలిసిన ప్రభువు చేత భాషయన నిదియని చెప్పబడిన భాష అన్నారు విశ్వనాథ సత్యనారాయణ.
ఒకసారి సాహితీ సౌందర్యారాధకుడు ఆచంట జానకీరాం గిడుగు వారిని చూడ్డానికి వారింటికి వెళ్లాడు. ఆయనప్పుడు రాయప్రోలు సుబ్బారావు రచించిన 'తృణకంకణం' పరిశీలిస్తున్నారు. కుశల ప్రశ్నల తర్వాత యథాలాపంగా గిడుగువారి బల్లమీద వున్న శబ్దరత్నాకరం తెరిచాడు జానకిరాం. మాటమాటకూ చాలాచోట్ల పెన్సిలుతో సవరణలే! ఎన్ని తప్పులు పట్టారో నాడు తెలుగువారు ప్రామాణిక గ్రంథంగా భావిస్తున్న, పాటిస్తున్న నిఘంటువులో? డిక్షనరీలో తప్పులుండవా? చూడు ఎన్ని తప్పులో అని కొన్ని చదివి విశదపరిచారు. ఇంతలో పక్కనే ఉన్న మరో స్నేహితుడు ఎందుకో చిన్నయసూరి ప్రస్తావన తెచ్చారు. వెంటనే సౌమ్యభావంతో మాట్లాడుతున్న గిడుగు ముఖంలో కోపపు రేఖలు ప్రజ్వరిల్లాయి. 'ఆ చిన్నయసూరి చేసిన అపకారమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఎన్ని ఏళ్ళు పడుతుందో ఆ తప్పులు దిద్దడానికి' అన్నారు. చూడండి - ఈ 'రాయవాచకం' ఎంత స్వచ్ఛమైన తెలుగో! ఇది చిన్నయసూరి కంటే ముందు వ్రాసినది. అప్పటి వ్యావహారిక భాషలో ఉన్న రాయవాచకం చదివి వినిపించారు. ఎంత చక్కని శైలి. వచనం ఎంత మృదువుగా నడిచింది. 'తెలుగువాణి అప్పటికింకా ముచ్చి బంగారపు నగలు తొడుక్కోలేదు' అన్నాడు జానకిరాం.
విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన పాశ్చాత్య యాత్రికులకు తెలుగు మాట్లాడేవారే ఎక్కువగా కనిపించారట. ఆ తెలుగు భాషలో ఏదో మాధుర్యం వినిపించింది. తెలుగు మధురమైన భాష అని కొనియాడారు. హెచ్.మారిస్ 1890లో ఇలా వ్రాశారు. ''తెలుగులాంటి సుశ్రావ్యమైన భాష మరొకటి లేదు. ద్రావిడ భాషలలో ఇది అన్నింటికంటే తీయనిదీ, సంగీతాత్మకమైనది. చదువు రాని వాళ్ళ పెదవుల మీద కూడా ఈ భాష మధురంగా వినిపిస్తుంది. ఈ భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారంటే అది సబబే''.
తెలుగు భాషోద్యమానికి గట్టి పునాదులు వేసిన వారిలో పానుగంటి లక్ష్మీనరసింహంను కూడా చెప్పుకోవాలి. తెలుగువారుగా పుట్టి పాశ్చాత్య భాషా వ్యామోహంలో కొట్టుకుపోతూ, తెలుగు అస్సలు మాట్లాడలేమని చెప్పుకునే తెలుగీయులను దుడ్డుకర్రతో కుళ్లబొడిచి కళ్ళు తెరిపించారు పానుగంటి.
'తెలివికి సంస్కృతమున్ మరి కలిమికి / ఆంగ్లేయమో యింక తురకంబో / విలువ యిడినేర్చి ఈ నీ తెలుగు / ఎవ్వరిపాలు చేసి తిరిగెద వాంధ్రా' - అని హెచ్చరించవలసిన దుర్గతి పట్టింది తెలుగుకు నేడు.
గ్రీకు రాయబారి మెగస్తనీసు, క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దిలోనే ఆంధ్రుల చతురంగ బలాలు వౌర్యుల చతురంగ బలాల కన్నా పటిష్ఠమైనవని వర్ణించాడు. ఆ పూర్వపు వ్యక్తులను, వ్యక్తిత్వాలని తలచుకుంటే తప్ప జాతికి మళ్లీ శూరత్వమూ, అభ్యుదయమూ రావేమో అందరూ ఆలోచించాలి. అందుకే శ్రీశ్రీ అంటాడు ఉత్తేజపరుస్తూ మనల్ని -
'తెలుగువాడి తెలివితేటలకు జైజై / తెలుగువాడు దేనికైనా సైసై / తెలుగువారి నెదురువారు నైనై / తెలుగునాట కవుల పాట హైహై/ ప్రస్తుతానికి వస్తామరి నేస్తం బైబై
'
ఆంజనేయుడి బలం ఆంజనేయుడికి తెలియదన్నట్లు తెలుగువారికి ఇంత గర్వించతగ్గ చరిత్ర ఉండి కూడా మనకే చరిత్రా లేనట్లు మన పూర్వ కాంతిపుంజాలను మరచిపోవడం భవిష్యత్తు తరాల వారిని దారి తప్పించిన వాళ్ళమవుతాము. చావలేదు చావలేదు తెలుగు మహోజ్వల చరిత్ర అని నిత్యం మననం చేసుకోవాలి. ఎదుగుదలలో పెరుగుదలలో తెలుగు తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలన్న ప్రయత్నంలో భాగమే మన ప్రపంచ తెలుగు మహాసభల ముఖ్యోద్దేశం. సకల జీవజాతి బతకడానికి గాలి ఎంత అవసరమో భాష కూడా అంతే అవసరం. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ పరిపాలన తెలుగులోనే సాగించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. మన తెలుగు భాష పరిరక్షణలో, తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తమైన తెలుగును వెలికితెచ్చిన విదేశీయులను తలచుకొని గర్వించాలి. మారుతున్న కాలాన్ని బట్టి ఇంగ్లీషులాంటి పర భాషలను నేర్చుకోక తప్పకపోయినా, మన తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం, చిన్నచూపు చూడటం, చులకన భావం చూపడం లాంటి భావాలను ప్రబలనీయని జాతిగా భావించుకోవాలి. తెలుగు భాషను మాట్లాడకపోవడం కన్నతల్లికి ద్రోహం చేసినట్లవుతుందనే తలపు మన తలలో నిలకడగా ఉండాలి. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవలలో విశ్వనాథ సత్యనారాయణ చెప్పినట్లు మాతృభాష పటిష్ఠంగా ఉన్నప్పుడే ఇతర భాషల్లో రాణించగలరన్న సంగతి పెడచెవిన పెట్టకూడదు. ఒక భాష అంతరిస్తే ఒక జాతి కనుమరుగై పోతుంది. ఈనాడు ప్రపంచంలో ఉన్న ఆరువేల భాషల్లో తెలుగు భాష మాట్లాడే మనం 16వ స్థానంలో ఉన్నందుకు గర్వించాలి. ఆ స్థానం మరింత ముందుకు వచ్చే ప్రయత్నాలు అధికార భాషా సంఘం చేపడుతున్నది. ఇటీవలే శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో వ్రాయించిన నూట పదకొండు శాసనాల పుస్తకం వెలువరింపబడింది. తెలుగు భాషను వ్యాకరణంతో సహా కంప్యూటరీకరించే ప్రయత్నాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. తెలుగు మాట్లాడేవారి సంఖ్యను బట్టి మిగతా దేశ భాషల్లో ద్వితీయ స్థానంలో ఉన్నా, స్వచ్ఛత, స్పష్టత, సంగీతాలతో అద్వితీయమైనది ఔన్నత్యంలో! నన్నయ, తిక్కన, ఎర్రన లాంటివారు మణిమాణిక్యాలు పొదిగారు. శ్రీనాథ, విశ్వనాథ వంటివారు సాహిత్యపుటేనుగులను రక్షణ కవచంగా మోహరింపజేశారు. వేదం వెంకటరాయశాస్ర్తీ, కందుకూరి, గురజాడ, గిడుగు పిడుగులు వ్యావహారిక భాషా సాహిత్యాలతో తెలుగు సింహాలను, గుర్రాలను, సైన్యాన్ని సన్నద్ధం చేశారు.

ఈనాడు ప్రపంచంలో తెలుగు భాష

No comments:

Post a Comment