"కలలు కనండి – వాటిని సాకారం చేస్కోండి" అని కలాంగారు మర్చిపోకుండా ఎక్కడికెళ్ళినా చెప్తుంటారు, మనం కలలు కనడం వరకు చెప్పక పోయినా చేసేయొచ్చు, ఆ తర్వాతదే కాస్త ఆలోచించి సాధించుకోవాలి. కానీ, దురదృష్టవశాత్తు అలాంటి పరిణామం ఏమీ కనబడటంలేదు. ఆయన కన్న 2020 కల కలలాగానే మిగిలిపోయే అవకాశలే మెండుగా కనిపిస్తున్నాయి.
ఉదాహరణకి, మన రాష్ట్రంలో 2003 కల్లా 81% మంది తెలుగు మాధ్యమం విద్యార్థులున్నారు. 2006 కి అది 78% గా ఉంది. ఇలాగే లెక్క గడితే 2020-2030 లలో ఈ సంఖ్య మహా అంటే 50% కి పడుతుంది. ఆ ఇంగ్లీషు మీడియం చదివేవాళ్ళలో కూడా ఎంత శాతం మంది సరైన ఇంగ్లీషు మాట్లాడగలరో, అర్థంచేసుకోగలరో అందరికీ తెలిసిందే! విషయాన్ని మాతృభాషలో చదివినదానికి, ఇంగ్లీషులో చదివినదానికి అవగాహన పరంగా చాలా తేడా ఉంటుంది. మాతృభాషలో చదివినదాన్ని మన మెదడు మరింత లోతుగా పరిశీలిస్తుంది, మీకు మీ మాతృభాష తెలిసుంటే. ఎలా అంటారా? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.
మన నిత్య జీవితంలో నోటికి బాగా నలిగిన పదాలు రెండు తీస్కుందాం - Hardware(హార్డ్వేర్), Software(సాఫ్ట్వేర్). ఇవి ఇంగ్లీషువారికి(మాతృభాష ఇంగ్లీషుగా ఉన్నవారు), తెలుగువారికి విడివిడిగా ఏ విధంగా అర్థం అవుతున్నాయో చూద్దాం. ఇంగ్లీషులో Soft అనే పదం మృదుత్వం అనే కాక, రూపంలేనిది అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. ఇది ఇంగ్లీషు మాతృభాషగా ఉన్నవారు తేలికగా గ్రహిస్తారు. ఇదెలా సాధ్యం అంటే, మన తెలుగులో "చెప్పు" అనే పదానికి రకరకాల అర్థాలున్నట్టే! కాని, అలాంటి అన్వయం ఇక్కడ మనంవాడే ఇంగ్లీషు భాషలో లేదు, ఉన్నా చాలా కొద్దిమందికే అది తెలుస్తుంది. అలాగే Hard అనే పదం కూడాను. అలా తెలియడం వల్ల ఆ పదాన్ని గురించిన ఎన్నో విషయాలు వెంటనే అవగాహనకొస్తాయి. Hardware అంటే బౌతిక రూపం గల ఒక పదార్థమని, Software అంటే రూపంలేని పదార్థమని. పద మూలాలు, వాటి నిగూడ, నిషిప్త అర్థాలు తెలిసుంటే ఇలాంటి విషయాలు వెంటనే స్ఫురణకొస్తాయి. మనకీ విషయాలు అస్సలు బొత్తిగా తెలియడం లేదు. పిల్లలకి ఐదారేళ్ళు రాగానే, వృత్తికి ఉపయోగపడుతుందని, వాళ్ళని ఇంగ్లీషు మాధ్యమంలో తోసేయ్యడం వల్ల వారికి మాతృభాషలో అందాల్సిన ఇలాంటి ముఖ్యమైన పదజాలం అందడంలేదు. దానివల్ల ఇటు మాతృభాషకి దూరమవుతున్నారు, అటు ఇంగ్లీషు పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు. దీని వల్ల వాళ్ళ ఆలోచనా శక్తి దారుణంగా కుంటుబడిపోతుంది! మనిషి ఆలోచనా శక్తికి భాష తోడవకపోతే ఆ ఆలోచన ఎందుకూ కొరగాదు. ఒక ఆలోచన వెనుక మన మెదడులో ఎన్నో చర్యలు చోటుచేసుకుంటాయి. అందులో ఒక ముఖ్యమైన ఘట్టం – ఆలోచనని వ్యక్తపరచడం, దానికో రూపాన్ని తీసుకురాగలగడం. ఇలా చేయలేకపోతే మెదడులో ఎన్ని ఆలోచనలు మెదిలినా ఉపయోగం ఉండదు, వాటికి సంయమనం కుదరదు. అందుకే, మనం రోజూ మాట్లాడే పదాల్లో ఈ భావ వ్యక్తీకరణ బలం ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మనం నిత్యం తెలుగు భాష దారాళంగా వాడుతుంటాం కాబట్టి, ఇంగ్లీషులో ఉన్న ఈ పదాల్ని, వాటి వెనుకున్న భావాల్ని, అర్థాన్ని బట్టి, మన భాషలో వాటిని సృష్టించి - నేర్చుకుని - వాడుకోవడం ద్వారా మనం ఆ భావ వ్యక్తీకరణ బలాన్ని పొందుతాం. "కొత్తగా పదాలు చేర్చడం ఎందుకు, ఇంగ్లీషు పదాలు మన భాషలో ఇమిడిపోయాయి కదా?" అని కొంతమంది ఉద్దేశ్యం. కాని అలా వచ్చిన పదాలు నేను పైన చెప్పిన బలాన్ని వాటితో తేవట్లేదు. ఇంగ్లీషులో అలాంటి కొత్త పదాల్ని అవసరమైనప్పుడు సృష్టిస్తారు. అందుకే ఆ భాష నిత్య యౌవ్వనంతో వెలుగుతోంది. అలాగే మనం కూడా మన భాషాబలాన్ని, తద్వారా మన ఆలోచనా శక్తిని కాపాడుకోవడం చాలా అవసరం. వాటిని తెలుగులో తెలుసుకున్నట్టైతే పద మూలాలు మనకి తెలిసుంటాయి కాబట్టి, అవగాహన చాలా సులువుగా ఉంటుంది. మాతృభాషలో చదవమంటోంది, ఏదో రాష్టాన్ని, భాషని ఉద్దరించి మిమ్మల్ని ఆహూతి కమ్మనడానికి కాదండి. దాని వల్ల మనకు కలిగే ఉపయోగలలాంటివి. ఇలాంటివి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. అసలు 30 కోట్ల జనంలో ఒక బిల్‌గేట్స్ పుడితే 114 కోట్ల మన భారతీయుల్లో ఒక్కడూ కనబడడే? మన ఈ (నిస్తేజ) పరిస్థితికి అది ఒక కోణం. ఇక ఇంకో కోణం చూద్దాం.
విజన్ 2020!
ఈనాటి భారతదేశం వైపు ప్రపంచంమంతా చూస్తోంది!
రేపు మనమే ప్రపంచానికి రారాజూలం!
ఇవి వినటానికి బ్రహ్మాండంగా ఉన్నాయి, చెవుల్లో తేనె పోసినట్టు! వార్తాపత్రికల్లో రోజూ ఎవరో ఒక నాయకుడు ఏదో ఒక సభలో ఇవన్నీ ఏకరువు పెడుతూనే ఉన్నట్టు చదువుతుంటాం. అసలు నిజంగా ఇది జరిగేదేనా? నాకూ ఇలా అనుమానుమొచ్చి కారణాలు వెతకడం ప్రారంభించాను - "మనకు ఇప్పటివరకూ లేనిదీ, ఇప్పుడు అమాంతంగా వచ్చేదీ ఏంటబ్బా?" అని. ఎంతైనా కలాం గారి లాంటివారు కూడా దీన్ని ప్రచారం చేస్తున్నారంటే ఏదో కారణం ఉండే ఉండాలి కదా మరి అనిపించింది! ఉంది, దొరికింది కూడానూ..!!
ఈ క్రిందున్న పటాన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి.
1960-1980 : అవి అమెరికాను ఆర్థికంగా, సామాజికంగా పెనుమార్పులకు గురిచేసిన రోజులు. విద్యపరంగా, రాజకీయాల పరంగా, ముఖ్యంగా ఆర్థిక స్థితిగతుల మార్పుల పరంగా[3] వాళ్ళ అభివృద్దిని స్పష్టంగా తెలియజెప్పిన రోజులవి. ఒకసారి ఆ పైనున్న పటం చూస్తే, అక్కడ చూపించిన నిష్పత్తి,సంపాదించే వయసులో ఉన్నవారి సంఖ్యని మిగతావారితో పోల్చేది.(అంటే working age : non-working age). దీని ప్రభావం వల్ల ఆ సమయంలో వారు సాధించుకున్న సాంకేతిక నైపుణ్యత వారికి ఎన్నో విజయాలు తెచ్చిపెట్టింది. ఉదాహరణకు కొన్ని పెద్ద పెద్ద దిగ్గజాల ఉనికి ఆ సమయంలో ఎంతో బలపడింది. IBM వంటి కంపెనీలు ఆ కోవకి చెందినవే.
1975-2000 : ఈ సమయంలో వచ్చిన పరికాలన్నిటిపై "Made in China", "Made in Japan", "Made in Korea" కాకుండా ఏదన్నా కనిపిస్తే అది మన దృష్టిలోపం అనుకోవల్సిందే! ఇప్పటికీ ఈ పరిస్థితి కాస్త అటు-ఇటుగా అలాగే ఉందని చెప్పొచ్చు. దానికి ఈ పటంతో సంబంధం ఏంటో నేను విడమరిచి చెప్పక్కర్లేకుండానే తేటతెల్లమౌతోంది.
అలాగే యూరప్ కూడానూ!
కానీ… పరిస్థితి మారుతోంది. దక్షిణాసియా శిబిరాల్లో ఆశలు మొగ్గలు తొడుగుతున్నాయ్! అవి వికసించి గుబాళించే సమయం రానే వచ్చింది. అందులో భారతదేశం చెప్పుకోదగ్గ కృషితో అంతర్జాతీయంగా తనకంటూ ఒక స్థానాన్ని భద్రపరుచుకుంది. ఐతే… మన అభివృద్ది పదంలో ఒక అగాధం కనీ-కనబడకుండా బయపెడుతోంది, పెను ముప్పుకి దారి తీసే అవకాశం ఉంది. ఆ పటంలో ఉన్న నిష్పత్తి వనరుగా గాక, బరువుగా పరిణమించే పరిస్థితి పొంచి ఉంది. అదేంటో చూద్దాం.
సంపాదించే వయసొచ్చినంత మాత్రాన సంపాదించడం జరిగిపోతే, మనం చింతిచాల్సినదేమీ లేదు. కానీ, వాళ్ళని సంపాదనమార్గంలో పెట్టకుండానే ఆ ఫలాన్ని ఆశిస్తే మిగిలేది నిరాశే! ఇంతకు ముందు చెప్పినట్టుగా, మన రాష్ట్రంలో 2003 లో 81% మంది తెలుగుమీడియం విద్యార్థులున్నారు. 2006 లో అది 78% గా ఉంది. ఇదే లెక్కలో తీస్కుంటే 2020-30 కి ఈ సంఖ్య 50% కి దిగదు. ఆ ఇంగ్లీషు మీడియంలో చదివేవాళ్ళలో కూడా సగానికి సగం పైగా, ఆ ఇంగ్లీషు మాధ్యమం నామమాత్రపు మాధ్యమమే, జరిగేవి మాతృభాషలోనే జరుగుతుంటాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితి తీస్కున్నా, మాతృభాషలో చదివే విద్యార్థులే అధికంగా కనిపిస్తున్నారు. బయటి పరిస్థితి చూస్తే అంతా టెక్నాలజీ మయం. ఆ టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు, నేర్చుకోవడానికి కావల్సిన వనరులూ, ఈ రెండూ ఇంగ్లీషు మయం! ఇటు చూస్తే వీళ్ళందరూ ఆ సంపాదించే వయసు వారే! తగిన సహాయం లేక ఒకవేళ వీళ్ళందరూ నిరుద్యోగ యువతగా పరిణమిస్తే? పరిస్థితి ఇలా ఉంటుంది…
ఇలాంటి దయనీయ స్థితిలో ఆ 50% పైనుండే వాళ్ళందరి పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉంది. వాళ్ళదాకా ఎందుకు? ఇంగ్లీషు మీడియంలో చదివేవారిలోనే ఎంతవరకు ఆ టెక్నాలజీకి సంబందించిన వాటిని ఇంగ్లీషులో చదివి అర్థం చేస్కోగలుగుతున్నారో చూస్తే విషయం ఎలాంటివారికైనా విశదమవుతుంది. ఇలాంటి పరిస్థితులు మనకు ముందే అభివృద్ది పదంలో అడుగులేసిన దేశాల్లో లేవా? ఉన్నాయ్.. వాళ్ళు దాన్ని సమర్థంగా ఎదుర్కొని నిలబడ్డారు కూడా. ఉదాహరణకి జర్మనీ, జపాన్, చైనా లాంటి దేశాల్లో ప్రభుత్వం, కొన్ని స్వచ్చంద సంస్థలు, టెక్నాలజీని వారి-వారి మాతృభాషకి చేరువ చేసే కృషితో అనుకున్నది సాధించారు. ప్రజల్ని, "వేరే భాషలో మీ కష్టాలు మీరు పడండి" అని గాలికొదిలేసే బదులు మనం అలాంటి దేశాల నుండి నేర్చుకున్న పాఠాలతో ముందున్న ముఖ్యమైన కార్యాన్ని సాధించలేమా?
No comments:
Post a Comment